అర్జున్ సమాచారం:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్‌లో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. బాధితుల ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 22A బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు మండిపడ్డారు.
మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్….
98 శాతం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అదే నిజమైతే వందలాది మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వస్తారు?
22ఏ జాబితాలో పెట్టడం ప్రభుత్వం చేసిన తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దరఖాస్తుల పేరుతో కార్యాలయాల చుట్టూ సామాన్య ప్రజలు ఎందుకు తిరగాలి? లక్షలాది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టి వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసి ప్రజలను శిక్షిస్తారా?
58 ఏళ్ల క్రితం ఏర్పడిన పద్మారావు నగర్ ఫేజ్-1, 1950ల నాటి స్ప్రింగ్ ఫీల్డ్, నిజాంపేట్ లాంటి కాలనీల్లోని దశాబ్దాల క్రితం నాటి పట్టా భూములను కూడా 22ఏలో చేర్చడం తుగ్లక్ చర్య కాక మరేమిటి..
ప్రభుత్వంలో పని కావాలంటే లంచాలు చెల్లించాల్సిందే అన్నట్లుగా ముఖ్యమంత్రి, పొంగులేటి ఏజెంట్లు వసూళ్లకు దిగారు.
మహబూబ్ నగర్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో విల్లాకు, ఫ్లాట్‌కు 30 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందని బాధితులు బహిరంగంగానే వాపోతున్నారు.
అమీన్పూర్ నుంచి వచ్చిన ఒక బాధితుడిని ఎంఆర్వో, ఆర్డీవో, కలెక్టర్ అంటూ చుట్టూ తిప్పించుకుని.. చివరకు బయట బ్రోకర్లను కలిస్తేనే పని అవుతుందని పరోక్షంగా బెదిరిస్తున్నారు.
ఈ 22ఏ కుట్ర వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగి ఉంది. దీనికి ఏ-1 రేవంత్ రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 50-50 కమీషన్ల కోసమే ఈ దోపిడీ అంతా జరుగుతోంది.
తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలుసు అని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటారు. ఆ వ్యాపారం తెలిస్తే ప్రజల కష్టాలు తీర్చాలి కానీ, వాళ్ల రక్తం పీల్చి పిప్పి చేస్తారా?
రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, హౌసింగ్ బోర్డు భూములతో పాటు చివరికి పిల్లలు ఆడుకునే వెయ్యి గజాల పార్కును కూడా రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టారు.
ఇలా అమ్ముకుంటూ పోతే రేపు గుడికో, బడికో.. చివరకు స్మశాన వాటికకు కూడా భూమి మిగలదు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కంచే చేను మేసినట్లుగా తయారై ఆస్తులను లాక్కుని ఆగం చేస్తోంది. ఈ కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఆడపిల్లల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైంది.
ఈ సమస్య కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22ఏలో పెట్టారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం, యాదాద్రి జిల్లా రాజంపేట మండలం చెల్లూరులో ఏకంగా సగం ఊరినే నిషేధిత జాబితాలో పెట్టారు. వ్యవసాయ భూములను 22ఏలో పెడితే రైతుబంధు రాదు, ఎరువులు దొరకవు, విద్యుత్ కనెక్షన్ ఇవ్వరు.
అమీన్పూర్ పోలీస్ స్టేషన్, చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22ఏ నిషేధిత జాబితాలోనే ఉన్నాయంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో, ఎంత గుడ్డిగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యమంత్రి తన తమ్ముడికి మాత్రం వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కట్టబెడతారు.. సామాన్య ప్రజల ఆస్తులను మాత్రం 22ఏలో పెట్టి ఇబ్బందుల పాలు చేస్తారు.
మల్కాజిగిరిలో 22ఏ భూములపై నేను మాట్లాడినప్పుడు, అక్కడికొచ్చిన వారి పేర్లు రాసుకుని వారి భూములను జాబితా నుంచి తొలగించారు.
అలాగే తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితుల వివరాలు తీసుకుని జాబితా నుంచి తీసేశారు. అంటే బీఆర్ఎస్ పోరాటం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక వస్తోంది.
ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రజల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ అండగా నిలబడుతుంది.
సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. దద్దరిల్లేలా సభను స్తంభింపజేసి అయినా బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా కొట్లాడుతాం.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాత్రికి రాత్రి చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? డబ్బుపై ఉన్న దురాశే రేపు ఆయన దుఃఖానికి కారణమవుతుంది.
ఈ వ్యవహారం వెనుక వందకు వంద శాతం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టే ఆయన సైలెంట్‌గా ఉన్నారు.
యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పారు.
తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేవలం 50-50 కమీషన్ల కక్కుర్తే దీనికి కారణం.
ఈ భూములను ఎవరు నిషేధిత జాబితాలో పెట్టమన్నారో విచారణ జరగాలి. తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
నిషేధిత జాబితాను సీక్రెట్‌గా ఎందుకు ఉంచుతున్నారు.. వెబ్సైట్లో జాబితాను ఎందుకు బ్లాక్ చేశారు? ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
ప్రజల భూములతో చెలగాటమాడుతూ వారిని నిద్ర లేకుండా చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి తక్షణమే బర్తరఫ్ చేయాలి.
=============================